టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును అరెస్ట్ చేసిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్థరాత్రి నుంచి పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం అనకాపల్లిలోని నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవిందబాబును గృహ నిర్బంధంలో ఉంచారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆయనను బలవంతంగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ మండలాల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆమె గత 4 రోజులుగా నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. పట్టణంలోని ఐలాండ్ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అద్దంకి - నార్కెట్ పల్లి హైవేపై రాకపోవకలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సత్తెనపల్లిలోనూ ఎన్ఎస్పీ కాలువ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టైర్లు తగలబెట్టారు. అడ్డుకోబోయిన పోలీసులుకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిన అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ టీడీపీ నేతల నిరసన చేపట్టారు. చిలకపాలెం - రాజాం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.