స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీం తీర్పు ఇవ్వనుంది. ఇక చంద్రబాబు అరెస్ట్ తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. టీడీపీ బృందానికి సాయంత్రం 5గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు.
చంద్రబాబు అరెస్టులో 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా.. నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్‌ను కలవనున్న వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. గవర్నర్‌తో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు సమావేశమై చర్చిస్తున్నారు.