ఏపీలో ‘నాలుగేళ్ల నరకం’ పోస్టర్ల కలకలం

Update: 2023-06-27 16:51 GMT

ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ ముందుకుసాగుతోంది. అధికార పార్టీ వైసీపీపై విమర్శల స్థాయిని రోజురోజుకు పెంచుతోంది. వైసీపీపై పోరుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తాజాగా కొత్త ప్రచారానికి టీడీపీ తెరలేపిన సంగతి తెలిసిందే. ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో సోమవారం పోస్టర్లను రిలీజ్ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహిళలు, రైతులు, యువత తీవ్రంగా నష్టపోయారని, విద్య, ఆరోగ్యం పక్కదారిపట్టిందంటూ గణంగాలతో సహా పోస్టర్లను విడుదల చేశారు. గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌, వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులు, ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఎంఎన్‌సీ కంపెనీల తరలింపు, నిరుద్యోగం వంటి కొన్ని ప్రధాన అంశాలను పోస్టర్లపై ముద్రించారు. రానున్న రోజుల్లో ‘నాలుగేళ్ల నరకం’ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News