అవినాశ్ రెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Update: 2023-05-31 06:02 GMT

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అవినాశ్ ను ఈ రోజు వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి గత శనివారం వాదనల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడంతో అవినాష్ భారీ రెడ్డికి ఊరట లభించినట్లు అయింది. హైకోర్టు విధించిన షరతులు ఏమిటనేది కాసేపట్లో తెలియనుంది. మరోవైపు, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వివేకా కేసులో ఎంపీ అవినాశ్ ను సీబీఐ ఏడు సార్లు విచారణ చేసింది. ఏడు సార్లు విచారణకు హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని అవినాశ్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నెలలో తక్కువ సమయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన కారణంగా తను హాజరు కాలేకపోయానని వివరించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా తానే తన తల్లిని చూసుకోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీబీఐ అర్దం లేని ఆరోపణలు చేస్తోందని కోర్టుకు వివరించారు. అవినాశ్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు కొనసాగించారు. అవినాశ్, సునీత, సీబీఐ తరపు సుదీర్ఘ వాదనలను విన్న తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని.. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు బెయిల్ కండీషన్లుగా స్పష్టం చేసింది.ప్రతీ శనివారం సీబీఐ ముందు హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది.

Tags:    

Similar News