AP Assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దానిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టడమే కాకుండా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం నశించాలంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
నిన్నటి లాగానే నేడు కూడా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులను, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్లక్ష్యం చేసిందంటూ నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెండ్ చేసిన సభ్యులు సభలోనే కొనసాగుతూ నినాదాలు చేశారు. టీడీపీ నేతల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఘన వెంకట రెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయస్వామి వంటివారు ఉన్నారు. టీడీపీ సభ్యులు సస్పెండ్ అవ్వడంతో సచివాలయం వద్ద ఆందోళన నెలకొంది. టీడీపీ నేతలు వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మాత్రం ఆగలేదు.