థాయిలాండ్ to ఏలూరు.. ఆ పందెం కోడి కోసం విదేశాల నుంచి..

Update: 2023-07-29 03:13 GMT

పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు. కత్తి కట్టి బరిలోకి ఒక్కసారి దించితే యజమాని పరువు కోసం ప్రాణాలకు తెగించి మరి పోరాడుతాయి, తన ప్రత్యర్థిపై విరుచుకుపడతాయి. అలాంటి పందెంకోళ్లకు పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు. ముఖ్యంగా సంక్రాంతి టైం వచ్చిందంటే చాలు కోడి పందేలతో జోరు మామూలుగా ఉండదు. అందుకే వీటిని ఎంతో జాగ్రత్తగా తమ పిల్లలకంటే ఎక్కువగా యజమానులు పెంచుతుంటారు. అలా సోషల్ మీడియాలో ఓ పందెం కోడి వీరత్వాన్ని చూసి దానిని ఎలాగైనా కొనాలని నిర్ణయించుకుని థాయిలాండ్ నుంచి నలుగురు యువతీయువకులు ఏలూరు జిల్లాకు వచ్చారు. కానీ పాపం వారి ప్రయత్నం ఫలించలేదు. తన పందెం కోడిని అమ్మేందుకు యజమాని ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక మరో పుంజు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు.

జిల్లాలోని లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన రత్తయ్య నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఈ గ్రమంలో ఈ ఏడాది భోగి పండుగ రోజున ఆయన తన పుంజుతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో కోడి పందేనికి వెళ్లారు. ఈ పందెంలో కోడి రూ.27 లక్షలు అది గెలిచింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని చూసిన థాయిలాండ్‌ యువతీయువకులు ఏమాత్రం ఆలోచించకుండా తమ దేశం నుంచి ఏలూరుకు వచ్చేశారు. ఆ పుంజును కొనడానికి రంగాపురానికి చేరుకున్నారు. కానీ రత్తయ్య దానిని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమీ లేక ఆయనతో ఓ ఫొటో దిగి, మరో పుంజును రూ.3 లక్షలకు కొనుగోలు చేసి తమతో పాటు పట్టుకెళ్లారు.

Tags:    

Similar News