Andhra Pradesh : తల్లితో కలిసి ప్రియడి ఇంటికి.. అర్ధరాత్రి వేళ దారుణం
యువకుడి ఫోన్‌లో ఉన్న తన కూతురు ఫోటోలు, మెసెజ్‌లు డిలీట్ చేయలేదని ఓ మహిళ అఘాయిత్యానికి ఒడిగట్టింది. అతడిపై కత్తి దూసింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలోని కానూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు సనత్‌నగర్‌కు చెందిన లంకే నాగరాజు ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ వర్క్‌షాపులో వెల్డర్‌గా పనిచేస్తుంటాడు. ఆరేళ్ల నుంచి అతడు.. లా చదువుతున్న ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. దీంతో ఆమె మనసు మార్చుకొంది. తాను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపి తనను మర్చిపోవాలని ఆ నాగరాజును కోరింది. ఫోన్లో ఉన్న ఫొటోలు, మెసేజ్‌లు తీసేయాల్సిందిగా కోరగా.. అందుకు అతడు అంగీకరించలేదు. ఇదే మాట ఇంట్లో చెప్పగా.. ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి ఈమె తన తల్లితో కలిసి నాగరాజు ఇంటికి వెళ్లింది. అర్ధరాత్రి అతడిని నిద్రలేపారు. తన కుమార్తె స్నేహితురాలిగానే వ్యవహరిస్తోంది కదా.. ఫొటోలు, మెసేజ్‌లు తీసేయకుండా ఎందుకు ఏడిపిస్తున్నావంటూ ప్రశ్నించింది ఆమె తల్లి. అతడి నుంచి ఫోన్ తీసుకొనే క్రమంలో అతడిని కత్తితో పొడిచింది. భయాందోళనలకు గురైన నాగరాజు పెద్దగా కేకలు పెట్టగా తల్లీకూతురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్థానికులు నాగరాజును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.