సీఎం జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని గురువారం సుధీర్ఘంగా చర్చించారు. సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలపై ఇరువరు మాట్లాడారు. జగన్‌తో భేటీపై బాలినేని సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ " సీఎం జగన్‌తో అన్ని విషయాలు చర్చించాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను ఎదుర్కొంటున్నా ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పార్టీలో నన్ను కొంత మంది ఇబ్బంది పెట్టారు. వారిపై ఫైట్ చేశాను. పార్టీలో విభేదాలను పరిష్కరిస్తానని సీఎం మాట ఇచ్చారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుంది? రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదు. పదవినే వదులుకొని వచ్చాను.. ప్రోటోకాల్ గురించి నేను ఫీలవుతానా..?ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి పెట్టమని సీఎం సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారు. పార్టీ మారతానని కావలనే ప్రచారం చేశారు. నా నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్‌తో భేటీ సంతృప్తినిచ్చింది " అని బాలినేని చెప్పారు.