గుడిలోకి దొంగలు.. దేని కోసం వచ్చారో తెలిస్తే ఫీజులు ఔట్.. తర్వాత స్టంట్ సీన్..
దేవాలయాల్లో చోరీలు జరగడం మామూలే. హుండీలోని సొమ్ముల కోసం, వీలైతే దేవుళ్లు ఆభరణాలను, ఇంకా వీలైతే ఏకంగా దేవుళ్లనే ఎత్తుకెళ్తుంటారు. ఎన్ని సీసీ కెమెరాల పెట్టినా, ఎంతమంది వాచ్‌మేన్లను నియమించినా చోరీలు ఆగడం లేదు. కొన్నిచోట్ల ఇంటిదొంగలే ఎత్తుకెళ్తున్నారు. ఏం ఎత్తుకెళ్లినా డబ్బు దస్కం, చీరలు గీరెలు తప్ప మిగతా వాటిని ముట్టుకోరు. నలుగురు దొంగలు మాత్రం హుండీని, దేవుళ్ల సొమ్మును కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెంట్రుకలు ఎత్తుకుపోవడానికి వచ్చారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న తలనీలాల కోసం చొరబడి హల్‌చల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం ఆలయంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దొంగలు పడిన సంగతి తెలుసుకున్నవాచ్‌మెన్ 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వన్ టౌన్ పోలీసులు హుటాహుటిన గుడిలోకి రాగా దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన రమేశ్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్ అనే దొంగను పట్టుకోబోగా వాడు రేకుల షెడ్డుపైనుంచి తోసేశాడు. రమేశ్ 12 అడుగులపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఇద్దర్ని పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. దొంగలు హుండీని చోరీ చేయడానికి ప్రయత్నించలేదని, జుట్టు కోసమేవెతికారని చెప్పారు. తలనీలాలు మార్కెట్లో వేలకు లక్షలకు అమ్ముడుబోతుండడంతో దొంగలు కొన్నాళ్లుగా వాటికోసం గుళ్లలోకి చొరబడుతున్నారు. తూర్పు గోదావరి అప్పనపల్లిలోని బాలాజీ ఆలయం, సింహాద్రి అప్పన్న ఆలయం, కాణిపాకం వినాయకుడి ఆయాల్లోనూ తలనీలాలు చోరీ అయ్యాయి.