CM Jagan : సీఎం జగన్ ప్రాణానికి ముప్పు.. భారీగా భద్రత పెంపు!

Byline :  Shabarish
Update: 2024-02-23 09:31 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో నిఘా వర్గాలు సీఎం జగన్‌ను హెచ్చరించాయి. జగన్‌కు మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని తేలింది. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డీజీపీ ఆంజనేయులు వెల్లడించారు. సంఘ విద్రోహ శక్తుల బెదిరింపుల దృ‌ష్ట్యా సీఎం జగన్‌కు భారీ భద్రతను పెంచినట్లు తెలిపారు. అందులో భాగంగా రెండు హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటికే జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఉంది. తాజాగా ఆయన ప్రాణానికి ముప్పు ఉన్న విషయం తెలియడంతో ఇంకాస్త భద్రతను పెంచారు.

ఆయన పర్యటనల కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను విజయవాడ, విశాఖలో అందుబాటులో ఉంటాయని డీజీపీ ఆంజనేయులు తెలిపారు. కేవలం సీఎం జగన్ భద్రత కోసమే రెండు హెలికాప్టర్లను లీజ్ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకుందన్నారు. ఒక్కోహెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సీఎం జగన్‌కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, క్రిమినల్ గ్యాంగ్‌లు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని చెబుతూ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఓ నివేదికను కూడా ఇచ్చారు.

ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎంకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం వినియోగిస్తున్న బెల్ హెలికాప్టర్ కూడా 2010 నుంచి ఉందని, ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు తక్షణమే రెండు హెలికాప్టర్లను కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.


Tags:    

Similar News