తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. గరుడవాహన సేవ సందర్భంగా తిరుమల కొండ భక్తజన సంద్రంగా మారింది.
ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు నడుస్తుండగా భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య సాయంత్రం 6.30గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తుల గోవిందనామస్మరణతో తిరు మాడవీధులన్నీ మార్మోగాయి. గరుడ సేవకు భారీగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.