Vizianagaram Train Accident: మానవ తప్పిదమే రైలు ప్రమాదానికి కారణం

By :  Bharath
Update: 2023-10-30 06:00 GMT

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందాగా.. దాదాపు 100 మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ- కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగింది. అదే సమయంలో దాని వెనకాలే పట్టాలు మారుతున్న విశాఖ- రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. కాగా చనిపోయిన 14 మందిలో 11 మంది వివరాలు తెలిశాయి. మిగతా ముగ్గురి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

కాగా రైలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఫెల్యూర్ వల్లే ప్రమాదం జరిగిందని వచ్చిన ఆరోపణలను అధికారులు ఖండించారు. ప్రమాదంలో ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదని.. విశాఖ- రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. డెడ్ స్లోగా వెళ్లాలని సిగ్నల్ సూచించినా.. లోకో పైలట్ వేగంగా వెల్లడంతో ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News