బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. జులై 17 బ్రేక్ దర్మనాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా జులై 16న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది.
టీటీడీ ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఆణివార ఆస్థానం నిర్వహిస్తుంది. అయితే సౌరమానాన్ని అనుసరించి తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం దీనికి పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభించేవారు. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఆణివారం ఆస్థానం సందర్భంగా సోమవారం ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేకపూజలు చేసి ప్రసాదాలు నివేదిస్తారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగిస్తారు. ఆణివార ఆస్థానం కారణంగా జూలై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.