వెంకన్నను నల్లరాయి అన్న నాస్తికుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా?.. TDP
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంపై TTD నేతలు ఫైర్ అవుతున్నారు. వెంకన్నను నల్లరాయి అన్న నాస్తికుడికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ ధ్వజమెత్తారు. ఏడు కాదు..ఐదు కొండలే అన్న వ్యక్తికి ఎలా అధికారం ఇస్తారని ఏసీ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు .సీఎంకు క్రైస్తవ మతం మీద ఉన్న నమ్మకం హిందూ ధర్మంపై లేదని ఆయనకు డబ్బే ప్రధానమని ఆరోపించారు.
మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుచ్చిరామ్ ప్రసాద్ మాట్లాడారు.." గతంలో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంట్లో జరిగిన ఓ పెళ్లి, క్రైస్తవ మత ప్రకారం జరిగింది. అంతే కాదు ఆయన క్రైస్తవుడని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి నక్సలైట్ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. శ్రీవారిని నల్ల రాయి అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసలు హిందూమతంపైనే నమ్మకం లేని ఓ వ్యక్తికి ఇంత ఉన్నతమైన పదవిని ఎలా ఇస్తారు? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగాఉన్నప్పుడూ కరుణాకర్‌రెడ్డినే టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడే తిరుమల దేవస్థానాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే హిందూసంస్థలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే భూమన లాంటి వ్యక్తికి ఈ పదవి అప్పజెప్పడం క్షమించరాని నేరం.
" తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి శేష వస్త్రాన్ని సమర్పించేప్పుడు భార్యతో సహా వెళ్లడం ఆచారం. కానీ దీనిని సీఎం జగన్ మంటగలిపారు. ఓ వైపు క్రైస్తవ మతాన్ని మోసం చేస్తూ..ఇటు హిందూ ధర్మానికి ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారు. అప్పటల్లో టీడీపీ బీసీలకు టీటీడీ చైర్మన్ పదవులు ఇస్తే..ఇప్పుడేమో జగన్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెడుతున్నారు. దేవస్థానం నిధులన్నీ గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా మఠాధిపతులు, పీఠాధిపతులు తమ స్పందన తెలియజేయాలి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సర్కార్ చర్యల్ని అడ్డుకోవాలి. వెంటనే కరుణాకర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలి" అని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు.