Tirumala : భక్తులకు చేతికర్రలు పంపిణీ చేసిన టీటీడీ

Byline :  Krishna
Update: 2023-09-06 12:20 GMT

తిరుమల నడకదారిలో చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. పలు రక్షణ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే నడకదారి భక్తులకు చేతికర్రలను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతి కర్రలను అందజేశారు. చేతికర్రలు మాత్రమే ఇచ్చి తమ పని అయిపోయిందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది కూడా ఉంటారని చెప్పారు.

‘‘చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని శాస్త్రీయ వాదన. నడిచి వెళ్లే భక్తులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేతి కర్రలు చేతులు దులుపుకొనే ప్రక్రియ కాదు. మెట్ల మార్గంలో టీటీడీ భద్రత సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. దీన్నిపై విమర్శలు చేసేవారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అని భూమన అన్నారు. అలిపిరి మెట్ల మార్గంలో ప్రస్తుతం పదివేల కర్రలు భక్తులకు అందుబాటులోకి తెచ్చామని ఈవో చెప్పారు. మరో పదివేల కర్రలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటికోసం కేవలం రూ.45వేలు ఖర్చయిందన్నారు. భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చిన చేతి కర్రలను ఏడవ మైలు నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.

కాగా తిరుమల నడకదారిలో చిరుతదాడిలో ఓ చిన్నారి చనిపోయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టి చిరుతలను బంధించింది. అయితే చిరుతల సంచార భయం మాత్రం పోలేదు. ఇప్పటికే మెట్ల మార్గంలో సిబ్బందిని నియమించింది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Tags:    

Similar News