తిరుమలలో దొంగలు పడ్డారు. చిన్నవస్తువులు ఎందుకనుకున్నారో ఏమో ఏకంగా బస్సునే కొట్టేశారు. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమల కొండమీద భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ఈ బస్సును ఉపయోగిస్తుంది. దీన్ని విలువ 2కోట్లు ఉంటుంది. తిరుమలలో బస్సు చోరీ అయ్యిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది.
ఇవాళ ఉదయం డిపోలో బస్సు కన్పించకపోవడంతో సిబ్బంది అంతా వెతికారు. ఎక్కడా లేకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీపీఎస్ ఆధారంగా బస్సు తిరుపతి జిల్లా నాయుడుపుట వద్ద ఉన్నట్లు గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు.
కాగా ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో డిపోలోని బస్సు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి నాయుడుపేట వరకు వెళ్లిన బస్సును పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించకపోవడం గమనార్హం. కాగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో ఏకంగా బస్సే చోరీ కావడం అందరినీ షాక్కు గురిచేసంది.