తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజే శ్రీవారి అర్జిత సేవా టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఫిబ్రవరి 19న మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేస్తామని ప్రకటించింది. 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం ఫిబ్రవరి 21వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చిన చెప్పింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేయనుంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనుంది.
ఇక మే నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనుంది. 24న ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు రూమ్స్ బుకింగ్ కోటాను విడుదల చేస్తామని తెలిపింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, దర్శన టికెట్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి బోర్డుకు సహకరించాలని టీటీడీ కోరింది.