Train Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఒకరి మృతి..
By : Kiran
Update: 2023-10-29 15:38 GMT
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద పట్టాలు మారుతున్న ఓ రైలును మరో రైలు ఢీకొంది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ ను వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో కరెంటు వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఫలితంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు.