ఘనంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
దివంగత వంగవీటి మోహనరంగ కుమారుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. నరసాపురంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం (సెప్టెంబర్ 3) ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. జనసేన నేత జక్కం బాజ్జి కుమార్తె పుష్పవల్లితో జరిగిన నిశ్చితార్థం జరగగా.. ఈ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన కొద్ది మంది ఆత్మీయులు మాత్రమే పాల్గొన్నారు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం అక్టోబర్ 22న రాధా-పుష్పవల్లి వివాహం జరుగనుంది. ఈ విషయం బయటికి రావడంతో వంగవీటి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
విజయవాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అయిన రాధాకు.. అతని తండ్రి రంగా మాదిరే లోకల్ యువతలో భయంకరమైన క్రేజ్ ఉంది. 2004లో రాధా కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత చాలా పార్టీలు మారారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మళ్లి ఓడిపోయారు. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల 2019లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా బెజవాడ గడ్డ వంగవీటి అడ్డా అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ వదిలి టీడీసీలో చేరిన రాధా.. పార్టీలో ఇమడలేకపోతున్నట్లు వినికిడి. మెగాస్టార్ చిరంజీవితో దగ్గరి అనుబంధం ఉండడంతో ఆయన జనసేనలో చేరొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన రాధా మరోసారి అలాంటి రిస్క్ తేసుకోవడానికి సిద్ధంగా లేరనే వాదన కూడా వినిపిస్తోంది.