యాజమాన్యంపై కార్మికుల ఆగ్రహం.. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ప్లాంట్ కు బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ.. పోర్టు యాజమాన్యంపై ఉక్కు కర్మాగారం కార్మికులు ఆందోళనకు దిగారు. 3,300 మంది కార్మికులు కలిసి భారీ ర్యాలీగా గంగవరం పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గాజువాక బాలచెరువు వైపు నుంచి కొందరు ప్లాంట్ కార్మికులు.. గంగవరం పోర్టు గేటులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పరుగులు తీస్తూ గేటువైపు పరిగెత్తారు. కాగా, వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు పోర్ట్ గేటు వద్ద భారీగా పోలీసులను మోహరించి.. ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గంగవరం పోర్ట్ ఫైర్, ఇతర రక్షణ సిబ్బంది కూడా ఆందోళన కారులను అడ్డుకున్నారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గని కార్మికులు గేటుకు 50 అడుగుల దూరంలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.