ఏపీలో ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామన్నారు. 82 వేలకు పైగా ఉపాధ్యాయులు బదిలీలు కోరారని తెలిపారు. అయితే, ఈసారి సుమారు 1,000 మంది ప్రత్యామ్నాయం లేక బదిలీ కాలేకపోయారని వివరించారు. రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 350 మంది ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తామన్నారు. ప్రస్తుతం 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పాఠశాలల్లో రాత్రి వాచ్‌మెన్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని.. 175 ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తామన్నారు. 98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరని.. అందుకే సబ్జెక్టు టీచర్లు లేని చోట విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ నెల 20వ తేదీన పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తామని బొత్స వివరించార.