ఇచ్చిన మాటను మడత పెట్టిన జగన్.. కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల!

Byline :  Shabarish
Update: 2024-03-07 11:50 GMT

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటను మడత పెట్టారని, తల్లిలాంటి ఏపీకి జగన్ వెన్నుపోటు పొడిచారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరిలాంటిదన్నారు. ఇప్పటికైనా పోరాడకపోతే ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదన్నారు. ఇచ్చిన మాటను జగన్ పక్కన పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.

తాను వ్యక్తిగత కారణాల వల్ల ఏపీ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీకీ ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయన మాటల వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని షర్మిల అన్నారు. ఆంధ్రాకు మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. మోడీ అంటే తనకు ఎంతో గౌరవం అని పవన్ అంటున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేవారు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం పోరాడేందుకు వచ్చానన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు వైసీపీ ప్రజలను మోసం చేస్తుంటే ఎంతో బాధగా ఉందని వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. సమావేశంలో షర్మిల కంటతడి పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు. షర్మిల మాటల్లో నిజాయితీ లేదని కొందరు అంటుంటే మరికొందరేమో సీఎం జగన్‌ను సరైన విధంగానే షర్మిల ప్రశ్నిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News