Roja: రోజాకు జగన్ షాక్.. ఆమె పోటీ ఎక్కడి నుంచంటే..?

Byline :  Krishna
Update: 2024-01-28 03:55 GMT

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో గెలుపు కోసం పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వైసీపీ సర్వేల ఆధారంగా సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఇంచార్జ్లను మారుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆర్కే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, పార్థసారథి పార్టీని వీడగా.. మచిలీపట్నం ఎంపీ సైతం జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఒంగోలు టికెట్ల పంచాయతీ వైసీపీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులుకు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. దీంతో ఈ టికెట్పై అధిష్ఠానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. మాగుంట స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోటీ చేయించాలని అధిష్ఠానం భావించింది. అయితే జిల్లా నేతలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గింది.

ఈ క్రమంలో మంత్రి రోజా పేరు తెరమీదకు వచ్చింది. ఒంగోలు ఎంపీ టికెట్ రోజాకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని బాలినేనికి విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రోజా మంత్రిగా బాధ్యతలు నిర్విర్తిస్తున్నారు. ఈ సారి నగిరి టికెట్ ఆమెకు ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను ఒంగోలు నుంచి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది.


Tags:    

Similar News