అమరావతిలో ఆర్ 5 జోన్ ఇళ్లపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్
రాజధాని అమరావతిలో R -5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయస్థానం డైరీ నంబర్ కేటాయించింది. మరో వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధానిలోని 9 గ్రామాల రైతులు కేవియట్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ వాదనలు కూడా వినాలని రాజధాని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇప్పటికే రాజధాని అమరాతిలో ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కూడా మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది. కానీ మొదటి నుంచి స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. కానీ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్తోంది. ఇటీవల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయగా కొద్దిరోజులకే ఇళ్ల నిర్మాణం ఆపేయాలని కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.