Srisaila Mallikharjuna Swamy : శ్రీశైలం మల్లన్నకై బంగారు రథం చేయించిన వైసీపీ ఎంపీ దంపతులు
శ్రీశైల మల్లికార్జునస్వామికి వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakar Reddy), ప్రశాంతి దంపతులు స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో ఈ బంగారు రథాన్ని తయారు చేయించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈరోజు స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు. సంప్రోక్షణ అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, వేమిరెడ్డి దంపతులు పాల్గొననున్నారు. బంగారు రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు.
ఇదే మొదటి రథం..
రథంలో 8 నందులు, వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణు, దుర్గ, లింగోద్భవ శివుడి మూర్తులు కనువిందు చేస్తున్నాయి. శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. దాతలు శుక్రవారం ఈ రథాన్ని దేవస్థానానికి అప్పగించిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దానిని ప్రారంభిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు.
మహాకుంభాభిషేక మహోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం నుంచి ఈనెల 21 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఇవాళ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పం చేయనున్నారు. 21న శాంతిహోమం, పౌష్టిక హోమం, మహా పూర్ణాహుతి, పునరుద్ధరించిన ఆలయాల్లో యంత్ర ప్రతిష్ఠలు, శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ, శివాజీ గోపురంపై సువర్ణ కలశ ప్రతిష్ఠ, విమాన గోపురాలు, ప్రధాన గోపురాలు, మూలమూర్తులు, ఇతర దేవతామూర్తులకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.