ఎన్టీఆర్కు పట్టిన గతే.. నీకు పడుతుంది.. పవన్కు నాని వార్నింగ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ను కలిసి ఓ విషయం చెబుతామంటే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు. ‘‘చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచుతాడని పవన్కు చెప్పాలనుకున్నా. రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్కే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుతో ఉంటే పవన్కు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి పవన్ చంద్రబాబుతో కలవొద్దు’’ అని నాని హెచ్చరించారు.
పవన్ ప్రజల మధ్య తిరిగితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని నాని అన్నారు. పవన్ జగన్ను విమర్శించడంతోపాటు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపొచ్చన్నారు. కానీ చంద్రబాబుతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నాదేండ్ల మనోహర్, లింగమనేని వంటి వారు చంద్రబాబుకు ఆప్తులు అని.. అటువంటి వారిని నమ్మొద్దని సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమకు లబ్ది చేకూరుతుందని కొందరు భావిస్తున్నారని.. అటువంటి నేతలు పవన్తో ఉన్నారని వ్యాఖ్యానించారు.
పవన్ తమతో కలిసొస్తే కనీసం ప్రతిపక్ష నాయకుడి స్థానం అయినా దొరుకుతుందని చంద్రబాబు అనుకుంటున్నారని నాని చెప్పారు. చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో వెన్నుపోటే ఉంటుందని.. పవన్ వీటిని గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఎప్పుడూ పవన్ను విమర్శించే కొడాలి నాని.. ఆయనకు సూచనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.