Vasantha Krishna Prasad:రాజకీయ భవిష్యత్‌ను రేపు ప్రకటిస్తా..
ఏపీలోని కృష్ణాజిల్లా మైలవరంసిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దారెటు అనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ను కాదని, మైలవరం వైసీపీ ఇంఛార్జిగా తిరుపతి యాదవ్‌ను వైఎస్ జగన్ నియమించారు. అయితే అంతకుముందు నుంచే అధిష్టానం తీరుపట్ల వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ కారణంగానే ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం సభకు కూడా హాజరుకాలేదు. అలాగే అనుచరులను సైతం సిద్ధం సభకు వెళ్లకుండా చేసినందుకు జగన్ సర్కార్ ఓ షాక్ ఇచ్చింది. మైలవరం పరిధిలో 28 మంది కో ఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు, సభ్యులను వైసీపీ ప్రభుత్వం తప్పించింది.
మరోవైపు వైసీపీ నుంచి టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవటంతో వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలను వసంత కృష్ణప్రసాద్ పరిశీలిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు జరిపి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే రేపు(సోమవారం) తన భవిష్యత్‌ను ప్రకటిస్తానని వెల్లడించారు. ఆదివారం తన ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం అనుచరులతోనూ చర్చించి భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు.
వైసీపీ అధ్యక్షుడు , సీఎం వైఎస్ జగన్ (CM Jagan) రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపొందే అభ్యర్థులను గుర్తించి వారికి నియోజకవర్గంలో ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. ఇన్‌చార్జిలే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేయడంతో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటికి అవకాశం దక్కడం లేదు. దీంతో నిరాశ చెందుతున్న ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటూ ఇతర పార్టీలోకి మారుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైలావరం నియోజకవర్గంలోనూ వసంత కృష్ణ ప్రసాద్ పేరును కాదని మరో వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. ఇంకోవైపు మైలవరం టీడీపీ ఇంఛార్జి దేవినేని ఉమామహేశ్వరరావు.. వసంత కృష్ణప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు