Vijayasai Reddy:కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్‌కు అలవాటే.. వైసీపీ ఎంపీ

Byline :  Veerendra Prasad
Update: 2024-02-05 11:41 GMT

ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని వైసీపీ కీలక నేత, రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసినా 10 ఏళ్లు అధికారం దక్కలేదని, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం మీద చర్చ జరిగింది. వైఎస్సాఆర్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి ... ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనికి ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని అన్నారు.

ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారని, పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు వైసీపీ ఎంపీ . ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించిందని , అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ అని అన్నారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తధ్యమని అన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ని నమ్మట్లేదన్నారు.

కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి. గత ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. నీతి లేని రాజకీయాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగుకావడం ఖాయమన్నారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని.. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 2029లో ఒక్క ఎంపీ కూడా ఉండడని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు.




Tags:    

Similar News