Raghu Rama Krishna Raju: రాజీనామా ఇచ్చి రాయుడు మంచి పని చేశారు.. ఆర్ఆర్ఆర్

Byline :  Veerendra Prasad
Update: 2024-01-07 04:05 GMT

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని రీతిలో పార్టీ లో చేరిన 10 రోజులకే ఆయన పార్టీకి రాజీనామా చేసి సంచలం సృష్టించాడు. కాగా తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిపై తాజాగా వైసీపీ రెబల్ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. జగన్‌ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి తనకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజుల్లోనే అర్థం చేసుకొని వైసీపీను వీడారని అన్నారు. చెడుగురించి ఇంత వేగంగా తెలుసుకున్న అంబటిని తాను అభినందిస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని మాజీ ఆటగాడు అంబటి రాయుడు 6 రోజుల్లోనే తెలుసుకున్నాడని సెటైర్లు వేశారు. మరో వారం, పది రోజుల వ్యవధిలో అంబటి.. టీడీపీ, జనసేన పార్టీలలో ఏదో ఒక దాంట్లో చేరతారేమోనని క్రికెట్‌ అభిమానులు పలు రకాలుగా భావిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మునిగిపోయే నావ వంటి వైసీపీను వీడాలని అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే.. ఓడిపోయే మ్యాచ్ ఆడకపోవడమే మంచిదనుకుని రాజీనామా చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును ముందుగానే అంచనా వేశాడన్నారు. క్రికెట్‌లో ఎంత వేగంగా అయితే పరుగులు చేస్తారో అంతే వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాల్సిందే అని రఘురామకృష్ణరాజు అన్నారు.

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు... కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తుండడంతో, ఆయన ఆ పార్టీలోనే చేరతారని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే డిసెంబరు 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రాయుడికి గుంటూరు లోక్ సభ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అసలు, గుంటూరు ఎంపీ టికెట్ ఆశించే రాయుడు వైసీపీలో చేరాడన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ అంతలోనే రాయుడు మనసు మార్చుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




Tags:    

Similar News