క్రైమ్, మోసాలు చేసేందుకు ఎవరూ భయపడడం లేదు. కోర్టు, కేసులు అనే జంకు లేకుండా రెచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల్లోనూ క్రైమ్ రేటు భారీగా పెరిగిపోతోంది. ప్రశాంతంగా ఉండే నగరాల్లో కూడా సినిమా స్టైల్లో కిడ్నాప్ లు, ఛేజింగ్‌లు లాంటివి జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సినీ ఫక్కీలో యువకుడిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇబ్రహీం పట్నం రింగ్ సెంటర్లో బుధవారం రాత్రి అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో వచ్చిన కొందరు వ్యక్తులు మొదట యువకుడిపై దాడి చేశారు. అనంతరం అనంతరం బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కారును ఛేజ్ చేసి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో యువకుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
గంపలగూడెం మండలం వినగడపకు చెందిన దిలీప్ అనే యువకుడు.. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి యువకులకు ఉద్యోగాలిస్తామని ఆశచూపి రూ.45 లక్షల వరకూ వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు నిలదీశారు. తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దిలీప్ మాత్రం వారికి కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో బుధవారం రాత్రి రింగ్ సెంటర్లో ఉన్నట్లు తెలుసుకున్న యువకులు కారులో వచ్చి దిలీప్‌ను కిడ్నాప్ చేశారు.