వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి 8వ నిందితుడు : సీబీఐ

Update: 2023-06-08 12:07 GMT

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడేనని సీబీఐ స్పష్టం చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్లో కీలక విషయాలను ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్ రెడ్డిల ప్రమేయం ఉందన్న సీబీఐ.. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకొడుకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని అభియోగాలు నమోదు చేసింది.

‘‘శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారు. ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్‌, శివశంకర్‌రెడ్డి చెప్పారు. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసు. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించాం’’ అని సీబీఐ పేర్కొంది.

ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని.. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ నివేదించింది. కాగా గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా సీబీఐ పేర్కొంది. కానీ ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో మాత్రం ఏ8గా ప్రస్తావించడం గమనార్హం. ఇక భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Tags:    

Similar News