YS Sharmila : 'మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?'.. షర్మిల సంచలన కామెంట్స్
ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం షర్మిల నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. తనపై తరచూ రోజా చేస్తున్న కామెంట్లపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజా గతం మర్చిపోయావా? అని మండిపడ్డారు. రోజా పాలన ఎలా ఉందని నగరిలో ఎవరిని అడిగినా ‘జబర్ధస్త్’గా దోచుకుంటోందని అంటున్నారని చెప్పారు. రోజా సోదరులు ఇద్దరు, ఆమె భర్త కూడా మంత్రిగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకను, మట్టిని కూడా వదలకుండా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ఇక సీఎం జగన్‌పై కూడా విరుచుకుపడ్డారు షర్మిల. "జగన్ పాలనలో వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉంది. అప్పు లేని రైతు ఒక్కరూ లేరు. మొత్తం అప్పుల పాలైపోయారు. రాజశేఖర్ రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకున్నారు. మరి జగన్ ఏం చేశారు? రైతులకు మద్దతు ధర వచ్చేలా ఒక నిధి ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో జగన్ చెప్పారు. ఏడాదికి రూ.3వేల కోట్లు ఆ నిధికే కేటాయిస్తామన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది అయినా కేటాయించారా? రూ.4వేల కోట్లతో రైతులకు నష్టపరిహారం (కరవు, వరదలు వచ్చినప్పుడు) ఇచ్చేలా మరో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. మరి సీఎం అయ్యాక.. ఒక్క ఏడాది అయినా నష్ట పరిహారం ఇచ్చారా? ఒక్కసారైనా రూ.4వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారా? ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఎన్నికలు అయిపోయాక అన్నీ మర్చిపోయారు. మరి మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు? మరి మీరా రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టేది? అంటూ ప్రశ్నించారు
ఏపీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, రాజధాని కూడా వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. "రాహుల్ గాంధీ ప్రధాని అయిన మొట్టమొదటి రోజే ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం పెడతానని చెప్పారు. మీరు కాంగ్రెస్ ను ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. పోలవరం వస్తుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన బిడ్డలకు మేలు జరుగుతుంది. మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన వస్తుంది. వైఎస్ఆర్ బిడ్డగా నేను మాటిస్తున్నా” అని షర్మిల అన్నారు.