ఔను.. చంద్రబాబు మాటిచ్చారు.. కానీ ప్రతీదీ రాజకీయాలతో ముడిపెట్టొద్దు: షర్మిల
వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి నిశ్చయం అయిన విషయం తెలిసిందే. జనవరి 18న తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం ఉండగా.. ఫిబ్రవరి 17వ తేదీన వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల ప్రముఖులందరినీ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును షర్మిల కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల..
ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. తన కొడుకు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చినట్లు చెప్పారు. గతంలో కూడా మా కుటుంబంలోని పెళ్లిళ్లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును పిలిచారని గుర్తుచేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి వస్తానని చంద్రబాబు మాటిచ్చినట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా లోకేశ్ కు స్వీట్లు కూడా పంపించాం. ప్రతీ విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని.. రాజకీయం తమ జీవితం కాదని, అది తమ వృత్తని షర్మిల చెప్పుకొచ్చారు. ప్రజాపోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. కానీ ఎలాంటి వ్యక్తిగత కక్షలుండవని అన్నారు.