దక్షిణాది రాజకీయాల్లో ఒకప్పుడు జయలలిత.. ఇప్పుడు వైఎస్ షర్మిల..!

Update: 2024-01-03 10:45 GMT

ఆంధ్రా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర మొదలు కాబోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆమె బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో పాటు స్టార్ క్యాంపైనర్ పగ్గాలు కూడా కట్టబెట్టున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు రాజకీయాల్లో ఓ ప్రధాన పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి మహిళా నేతగా షర్మిల చరిత్రకెక్కనుంది. వైసీపీ గౌరవాధ్యక్షరాలిగా షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ పనిచేసినా అది క్రియాశీల పదవి కాదు. కొడుకు చెప్పుచేతల్లో నడుచుకున్న విజయమ్మను ఏపీ ప్రజలు పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడించారు కూడా. ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో హల్ చల్ చేసిన షర్మిల మాత్రం తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ జాతీయ పార్టీలో కీలక పదవి చేపట్టబోతున్న రాజన్న బిడ్డ ఏపీ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది ఆసక్తికరం.

తెలంగాణ, ఏపీల్లో దిగ్గజ మహిళా నేతలు చాలమంది ఉన్నా పార్టీలకు నాయకత్వం వహించిన వాళ్లు లేరు. కల్వకుంట్ల కవిత, నందమూరి లక్ష్మీపార్వతి, విజయశాంతి, భూమా శోభా నాగిరెడ్డి, పరిటాల సునీత, రేణుకా చౌదరి తదితరులు ఎంత మంది ఉన్నా వాళ్ల పార్టీల అగ్ర నాయకులందరూ పురుషులే. ఈ నేపథ్యంలో షర్మిల ఓ ప్రధాన పార్టీ బాధ్యతలు చేపడుతున్నారు. రాజన్న బిడ్డగా ఏపీ కాంగ్రెస్‌కు ఆమె జవసత్వాలు అందిస్తారని అధిష్టానం గంపెడాశ పెట్టుకుంది. అయింత సొంత అన్న జగన్‌తో ఆమె ఎలా తలపడతారు, కాంగ్రెస్ కేడర్‌ను ఎలా నడిపిస్తారు? ఏపీ ప్రజలను ఎలా ఆకట్టుకుంటారు? ఈ ప్రశ్నలన్నిటీ ఎన్నికలు సమాధానం చెప్పనున్నాయి.

వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ పార్టీలోనూ మహిళలు నాయకత్వ శ్రేణిలో లేరు. జయలలితతోనే మహిళా నేతల హవా అంతరించింది. ఆమె నెచ్చెలి శశికళ రంగంలోకి దిగినా అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతో అన్నాడీఎంకే కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. కరుణానిధి కూతరు కనిమొళి కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని కనుమరుగయ్యారు. జయలలితకు ముందు సీఎంగా పనిచేసిన ఎంజీఆర్ భార్య వీఎన్ జానకి మెరుపులా మెరిసి మాయమయ్యారు. దక్షిణాదిలో తొలి మహిళా సీఎంగా రికార్డు సృష్టించిన ఆమె ఆ పదవిలో ఉన్నది కేవలం 23 రోజులే. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి సినీనటి రికార్డు కూడా ఆమెదే కావడం విశేషం. తర్వాత జయలలిత సీఎం అయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాయావతి, మమతా బెనర్జీ, రబ్రీదేవి, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, వసుంధరాజే సింధియా తదితరులు ముఖ్యమంత్రి పీఠాలకు వన్నె తెచ్చారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో ఒక్క జయలలిత మాత్రమే ఆ స్థాయి నాయకురాలు కావడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు మహిళలకు నామ్ కే వాస్తేగా సీట్లు, పోస్టులు ఇస్తున్నాయి. కీలక పదవులకు బంధుత్వాలు, ఆశ్రితపక్షపాతమే ప్రాతిపాదికగా మారింది. వ్యక్తిగతంగా తమకంటూ ఓ ఇమేజ్ ఉన్నప్పటీ అగ్రనాయకులంతా పురుషులే కావడంలో మహిళా నేతలంతా అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. షర్మిల కూడా రాజకీయ వారసత్వం నుంచే వచ్చినా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రవ్యాప్తగా అంతో ఇంతో కేడర్ సంపాదించుకున్నారు. అరెస్టులు, బెదిరింపులు ఎదుర్కన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేసి ఒకటో రెండో సీట్లు వచ్చేవన్న అంచనాలు కూడా వెలుడ్డాయి. అంత కష్టపడి నిర్మించిన పార్టీని నట్టేట ముంచి కొత్త ఆశలతో ఏపీలోకి అడుగుపెడుతున్న షర్మిలను ఏపీ ప్రజలు విశ్వసిస్తారా? ఒక పక్క అన్నతో, మరోవైపు బలమైన టీడీపీతో ఆమె దీటుగా తలపడగలదా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాలంటే కావాలంటే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే. ఏదేమైనా అన్న వదిలిన బాణం, కేసీఆర్ వదిలిన బాణం అని నిందలు మూటగట్టుకున్న షర్మిల.. ఓ జాతీయ పార్టీ నాయకురాలిగా మారనుండటం ఆహ్వానించాల్సిన పరిణామం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Full View

Tags:    

Similar News