YS Sharmila : ఉద్రిక్తంగా ‘చలో సెక్రటేరియట్‌’.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ షర్మిల

Byline :  Veerendra Prasad
Update: 2024-02-22 06:56 GMT

వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని, నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దేవుడి దయ ఉంటే మెగా డీఎస్సీ ఇస్తామని గతంలో సీఎం చెప్పారని, ఇప్పుడు దేవుడి దయ ఏమైందంటూ ప్రశ్నించారు. జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. ఒక్క జాబ్ క్యాలెండరూ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చినందుకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఏపీ కాంగ్రెస్.. ఇవాళ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపడుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే నిర్బంధించారు.

గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్‌వలీలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. బైఠాయించి ఆమె నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మెగా డీఎస్సీ ప్రకటిస్తానని తప్పుడు హామీలు ఇచ్చిన జగన్ ఓ దగా ముఖ్యమంత్రి అని షర్మిల ఫైర్ అయ్యారు. తమ ఆందోళన చూసి జగన్ సర్కార్ భయపడుతోందని, అందుకే తమ చుట్టూ వేలాదిమంది పోలీసులను పెట్టారన్నారు. కర్ఫ్యూ వాతావరణం సృష్టించి తమ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, జర్నలిస్టులకు మాట్లాడే హక్కు లేదా? అని విమర్శిస్తూనే.. ఇది ఏపీనా? ఆఫ్టనిస్తానా? అంటూ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తాము నిరసనలు తెలపాలనుకుంటే ఎక్కడికక్కడ నియంత్రించారని, జర్నలిస్టులను చితకబాదుతున్నారని మండిపడ్డారు. పోలీసులను మీ బంటుల్లా వాడుకుంటారా?మీరేమైనా తాలిబన్లా? అని ప్రశ్నించారు. ఒక్క జాబ్ క్యాలెండరూ ఎందుకివ్వలేదు? ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 21వేల మంది మన రాష్ట్రంలో ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ పాపం ప్రభుత్వానిదే అని షర్మిల వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News