వివేకా హత్య కేసు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

Update: 2023-06-30 07:48 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు సీబీఐ కోర్టు జూలై 14వరకు రిమాండ్ ను పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను మరో 14 రోజుల వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది. దీంతో నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా.. ఇది మూడోది. అయితే ఇదే ఫైనల్ ఛార్జ్‌షీట్ అని తెలుస్తోంది.

ఇక వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. గతంలో అత్యున్నత న్యాయస్థానం జూన్‌ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. వైఎస్ వివేకా కేసులో సుప్రీంకోర్టు విచారణకు ముందు.. ఈ కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సుప్రీంకు సమర్పించింది. అయితే.. సుప్రీంకోర్టు విధించిన గడవు మేరకు దర్యాప్తును ముగించామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పేర్లు జులై 3న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో బయటకు రానున్నాయి.

Tags:    

Similar News