అధికార దౌర్జన్యం.. తహసీల్దార్‌ చెంపపై కొట్టిన వైసీపీ నేత

Byline :  Veerendra Prasad
Update: 2023-09-20 05:34 GMT

ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న తహసీల్దారుతో గొడవ పడ్డాడు. మాట వినకపోవడంతో ఆగ్రహానికి గురై... మండల మెజిస్ట్రేట్‌ అని కూడా చూడకుండా గొంతుపట్టుకొని.. దాడికి దిగాడు. జిల్లాలోని సంతనూతలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా.. కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణరెడ్డి సుమారు మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై సంతనూతలపాడు మండల తహసీల్దారుగా వచ్చారు. కొన్నాళ్లుగా ఆయనకు... వైసీపీ మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. వివిధ పనుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో ఆగస్టు 18న వ్యక్తిగత కారణాల పేరిట తహసీల్దారు సెలవుపై వెళ్లారు.

సెప్టెంబర్‌ 11న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయంలోనే ఇరువురి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన చెంచిరెడ్డి.. తమ పనులు ఎందుకు చేయడం లేదంటూ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని తహసీల్దారు చెప్పడంతో చెంచిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తహసీల్దారు గొంతు పట్టుకుని, చెంపపై కొట్టారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘటనపై ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తహసీల్దారు లక్ష్మీనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సంఘం ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు సంఘటన వివరాలు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ నుంచి ఫిర్యాదు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.




Tags:    

Similar News