నిత్యావసర సరుకుల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఆ మధ్య వంట నూనె ధరలు పెరగగా, మొన్నటి వరకు టమాటా ధరలు భారీగా పెరిగాయి. పచ్చిమిర్చి కూడా బెంబేలెత్తించింది. తాజాగా కూరగాయ ధరలు కొంచెం దిగి వస్తున్నాయి. అయితే మరోవైపు మసాలా దినుసుల ధరలు షాక్ కొట్టడంతో ప్రజలు అల్లాడుతున్నారు. సుగుంద ద్రవ్యం జీలకర్ర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కూరకు రుచిని అందించడంలో కీలకమైన జీలకర్ర కొనడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జీలకర్ర ధర సామాన్యుడికి అందనంత స్థాయిలో పెరిగిపోతోంది.
15 రోజు క్రితం వరకు కిలో రూ.1200 పలికిన జీలకర్ర ఇప్పుడు రూ.1400కి చేరింది. అంటే 15 రోజుల్లో 200 రూపాయలు పెరిగింది. జీలకర్రతో పాటు పసుపు, కొత్తిమీర, లవంగం, దాల్చిన చెక్క, ఎర్ర మిర్చి సహా ఇతర మసాలా దినుసుల ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్లో తగినంత సరఫరా లేకపోవడతో ధరలకు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే జీలకర్ర ధరలు మరింతగా ప్రియం కానున్నాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా జీలకర్ర పంట ఉత్పత్తిలో 70 శాతం వాటా భారత్ దే. గుజరాత్, రాజస్తాన్ లో ఎక్కువగా జీలకర్రన పండిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో జీలకర్ర దిగుబడి తగ్గింది. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో జీలకర్ర ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.