మండుతున్న ఎండలు..స్కూల్స్‌పై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం

Update: 2023-06-18 16:21 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మూడో వారంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. వేడిగాలులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా ఒంటి బడులును మరిన్ని రోజులు పెంచాలని నిర్ణయించింది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించనున్నారు.

వేసవి సెలవులు అనంతరం జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఎండలు తగ్గని కారణంగా జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అయితే ఇప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోవడంతో ఒంటి బడులును పెంచింది. వడ గాలులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. స్కూల్స్‌కు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌లు వచ్చినా ఒంటి పూట బడుల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపింది.

ఇక గవర్నమెంట్ స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కు ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి.. ఇంటకి పంపించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News