తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్

Update: 2023-06-27 02:54 GMT

నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ ఎగ్జామ్ను తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లొ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఐఐటీ కౌన్సిల్ ఏప్రిల్ 18న జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను కేంద్రం తాజాగా తెలిపింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు మినహా.. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ ఎగ్జామ్ సాధ్యాసాధ్యాలపై 5 నెలల్లో నివేదిక ఇచ్చే బాధ్యతను ఢిల్లీ ఐఐటీకి అప్పగించింది.

2024-25 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో క్రీడా కోటా అమలుకు విధివిధానాల రూపకల్పన బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించింది. ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరిట్‌ కమ్‌ మీన్స్‌ (ఎంసీఎం) స్కాలర్‌షిప్‌, పాకెట్‌ అలవెన్స్‌ను పెంచాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పుర్‌కు అప్పగించారు. పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్‌ కోర్సులను రూపొందించాలని నిర్ణయించగా.. దీనిపై ఐఐటీ హైదరాబాద్‌ నివేదిక సమర్పించనుంది.

ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పుర్‌ను కేంద్రమంత్రి ఆదేశించారు. పీఎం రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (పీఎంఆర్‌ఎఫ్‌) రెండో విడతను అయిదేళ్లపాటు కొనసాగించనున్నారు. ఏడాదికి వెయ్యి మంది చొప్పున అయిదేళ్లలో 5 వేల మంది పీహెచ్‌డీ విద్యార్థులకు ఈ ఫెలోషిప్‌ అందజేస్తారు. ఖరగ్‌పుర్‌, మద్రాస్‌, గువాహటి, భువనేశ్వర్‌ ఐఐటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు ప్రారంభిస్తారు. వచ్చే 25 ఏళ్లకు ఐఐటీలన్నీ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచించారు. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో కలిపి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 

Tags:    

Similar News