Minister Seethakka : 2% Reservation: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వారికి రిజర్వేషన్ కల్పించాలి

Update: 2024-01-03 01:35 GMT

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అనాథ పిల్లలకు 2 శాతం కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా సులభతరం చేయాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల వద్దే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలని... అక్కడే ప్రీ స్కూళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆమె కోరారు. అంగన్‌వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు.




 


మంగళవారం సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణ సంస్థలకు ట్రైనింగ్‌ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్‌ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 




 





Tags:    

Similar News