కేంద్రంలోని పలు విభాగాల్లో లక్షల్లో పోస్టులు ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ నెట్టుకొస్తోంది. భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్న శాఖల్లో రైల్వేశాఖ ఒకటి. దాదాపు 2.74లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం(RTI) కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ వివరాలను వెల్లడించింది. 2.74లక్షల ఖాళీల్లో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది జూన్ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు స్పష్టం చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్ నాటికి 1.52లక్షల ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యమని అధికారులు వివరించారు. ఇప్పటికే 1.38లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని.. వీరిలో 90వేల మంది విధుల్లో చేరారని తెలిపారు వీటిలో వీటిలో 90శాతం పోస్టులు సేఫ్టీ కేటగిరీలోనే భర్తీ చేశారు.