గురుకుల పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి ఎగ్జామ్స్.. 15నిమిషాల ముందే గేట్లు క్లోజ్
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 23 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. 9,210 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు లాగిన్ అయి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. గురుకులాల్లో పోస్టులకు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
3 షిఫ్టుల్లో ఎగ్జామ్
19 రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్ని మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఉదయం షిఫ్టులో 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టులో 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టులో 4.30 నుంచి 6.30 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి షిఫ్టులో పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. గేట్లు మూసిన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని, పరీక్ష సమయం పూర్తయ్యే బయటకు పంపమని అధికారులు స్పష్టం చేశారు.
గుర్తింపుకార్డు తప్పనిసరి
అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఐడెంటిటి కార్డు లేనివారిని ఎగ్జామ్ రాసేందుకు అనుమతించమని చెప్పారు. అభ్యర్థులు తమ వెంట ఎలాంటి కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. బూట్లతో పరీక్ష గదిలోకి అనుమతించమని చెప్పారు.
నెగిటివ్ మార్కింగ్
ఇదిలా ఉంటే గురుకుల ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అధికారులు చెప్పారు. పేపర్-1, 2, 3లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత ఉంటుందని అన్నారు. ఎగ్జామ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు పాస్ వర్డ్ చెప్పనున్నారు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లెం తలెత్తితే కంప్యూటర్ ఆటోమేటిక్ గా అడిషనల్ టైం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.