భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతుంది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో.. చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపించడంతో.. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పోస్ట్ గ్యాడ్యుయేట్ (పీజీ) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్రమంలో జూలై 28 నుంచి జరగాల్సిన పరీక్షలను ఆగస్టు 16 న నిర్వహించనున్నారు. రెండు, నాలుగో సెమిస్టర్ల సిలబస్ పూర్తికాకపోవడంతో.. పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఇటీవల ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. అయితే జూలై 26, 27 తేదీల్లో ఇంటర్నల్స్ జరగనున్నాయి.