నిరుద్యోగులకు గుడ్ న్యూస్... CGL-2023 నోటిఫికేషన్‌లో మార్పులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల విడుదల చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(CGL) ఎగ్జామ్-2023 నోటిఫికేషన్‌లో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. నోటిఫికేషన్ సమయంలో మొత్తం 7,500 ఖాళీలు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 8,440కు పెంచుతూ సవరణ ప్రకటన విడుదల చేసింది. దీంతో అదనంగా 940 పోస్టులు చేరాయి. సీజీఎల్-2023 నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలకాగా.. టైర్-1 పరీక్షలను జులైలో నిర్వహించి, ఆగస్టు 1న ఆన్సర్ కీ విడుదల చేసింది. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో టైర్ 2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది.