TS DSC Notification 2023: రేపటి నుంచి డీఎస్సీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షురూ
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవలె DSC 2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ , మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5089 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్ష జరగనుంది. అదే విధంగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే సమాచారాన్ని తాజాగా స్యూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది.
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కార్ సెప్టెంబరు 7న నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇందులో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు,పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారానే ఈ భర్తీ చేయనుంది సర్కార్. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358 , నిజామాబాద్ జిల్లాలో 309 పోస్టులు ఖాలీగా ఉన్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
డీఎస్సీ కి అప్లై చేసుకునే అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ పీజుగా రూ.1000 చెల్లించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, గవర్నమెంట్ ఎంప్లాయిస్కు 5 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు 10ఏళ్ల పాటు వయోసడలింపు ఉండనుంది.