పరీక్షల సమయంలో విద్యార్థులు , అభ్యర్థులు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అన్నీ తెలిసినా ఎక్కడో ఏదో ఒక ఆందోళన ఉంటుంది. మొదటిసారి పోటీ పరీక్షలు రాసే చాలా మంది అభ్యర్థులకు పరీక్ష హాలుకు వెళ్లేప్పుడు ఎలా వెళ్లాలి? ఏం తీసుకెళ్లాలి? ఏమి తీసుకెళ్లకూడదు అన్న విషయాలపై అవగాహన ఉండక పొరపాట్లు చేస్తుంటారు. రేపటి నుంచి అంటే ఆగస్టు 1 నంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా TREIRB పరీక్ష జరుగనుంది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ రాత పరీక్షకు మొత్తం 2.66 లక్షల మంది పోటీ పడుతున్నారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేశారు.
అభ్యర్థులు పాటించాల్సినవి:
* ప్రతి అభ్యర్థి వారికి సూచించిన సమయంలోనే పరీక్ష హాలుకు రావాలి. సమయానికి సెంటర్‌కు చేరుకుంటేనే బయోమెట్రిక్, ఫొటో తీసుకుంటారు.
* రోజుకు మూడు షిఫ్టుల్లో 19 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఎగ్జామ్ కు రెండు గంటల సమయం కేటాయించారు. ఉదయం 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.
* ప్రతి షిఫ్టు ఎగ్జామ్‌కు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. ఆ తరువాత ఎవరినీ పరీక్ష సెంటర్‌కు అనుమతించరు.
* ఒకసారి సెంటర్లోకి ప్రవేశించిన తరువాత ఎగ్జామ్ పూర్తయ్యే వరకు బయటకు అనుమతించరు.
* పరీక్షకు వచ్చే అభ్యర్థులు మరిచిపోకుండా హాల్‌టికెట్‌తో రావాలి. దానితో పాటు ఒక ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాలి. గుర్తింపు కార్డు తీసుకెళ్లకపోతే పరీక్ష సెంటర్లోకి అనుమతించరు. అంతే కాదు హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ సరిగా లేకపోతే అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ, తీసుకోవడం మరిచిపోవద్దు. లేదంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* బయటి నుంచి కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులను వెంట తీసుకెళ్లకూడదు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు చెప్పులతో మాత్రవే రావాల్సి ఉంటుంది. బూట్లతో వస్తే అనుమతించారు.
* అపాయింట్మెంట్ లెటర్ వచ్చే వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లను భద్రంగా ఉంచుకోవాలి.
* పరీక్ష మొదలుకావడానికి 10 నిమిషాల ముందు అభ్యర్థులకు పాస్‌వర్డ్ చెబుతారు. కంప్యూటర్‌లో ఎంట్రీ చేశాక అభ్యర్థులు పరీక్ష ఎలా రాయాలో సూచనలు వస్తాయి. ఆ తరువాత సమయానికి స్క్రీన్‌పై ప్రశ్నలు కనిపిస్తాయి. సమయం పూర్తి కాగానే స్క్రీన్ ఆఫ్ అవుతుంది. పరీక్ష సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వచ్చినా కంప్యూటర్ ఆటోమేటెడ్‌గా అభ్యర్థికి అదనపు సమయం ఇస్తుంది.