టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. చైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఇటీవలే ఆమోదం తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి సర్కారు లేఖ రాయడంతో తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినందున రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్ తో పాటు సభ్యుల పేర్లు ప్రతిపాదించనుంది. ప్రభుత్వం పంపిన పేర్లను పరిశీలించిన గవర్నర్ ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి పదవి నుంచి వైదొలిగారు. అనంతరం సభ్యులైన కారం రవీందర్రెడ్డి, లింగారెడ్డి, సుమిత్ర ఆనంద్ తానోబా, అరుణ కుమారి రాజీనామా లేఖల్ని గవర్నర్కు పంపారు. అయితే వారి రాజీనామాలు ఆమోదించడంలో గవర్నర్ జాప్యం చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్, సభ్యుల భర్తీ జరగనందున కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేకపోతోందంటూ మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కోరారు. ఈ క్రమంలో ఎట్టకేలకు వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో.. ఛైర్మన్, సభ్యుల నియమకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.