రేపు తెలంగాణలో టెట్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో అత్యంత టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2052 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. రేపు ఒకేరోజు పేపర్1, పేపర్2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్2 పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 4,78,055 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు.
రేపు జరగనున్న టెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా ఏర్పాటు చేసిన 2052 పరీక్ష కేంద్రాలకు ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను నియమించారు. వీరితో పాటు 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10వేలకు పైగా హాల్ సూపరింటెండెంట్లు కూడా నియమించనున్నారు. పరీక్ష కేంద్రాలున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలోనే టెట్ నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోనున్నారు . మందులు కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పరీక్ష హాలుకు సమయానికి వచ్చేలా ఆయా రూట్లలో బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ సంస్థను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కోరారు.
టెట్ అభ్యర్థులకు సూచనలు :
* పరీక్షా కేంద్రాలకు అప్పటికప్పుడు చేరకుండా ఒక రోజు ముందుగానే చేరుకునేలా అభ్యర్థులు చూసుకోవాలి.
* రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు తెచ్చుకోవాలి.
* హాల్ టికెట్లను మరిచిపోవద్దు
* మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదు.
* ఓఎంఆర్ షీట్‌ను మలవకూడదని, వాటిపై పిన్నులు కొట్టకూడదు
* ఆన్సర్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్‌పైన ఉండే సర్కిల్‌ను పూర్తిగా షేడ్ చేస్తేనే పరిగణలోకి తీసుకుంటారు.