తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. "టెట్ ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి." ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,052 సెంటర్లలో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. టెట్ ఎగ్జామ్కు 4,78,055 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్ 27న తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చని అన్నారు.
పేపర్-1కు 2,69,557 మంది అప్లై చేయగా 2,26,744 (84.12 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్-2 కోసం 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.11 శాతం) మంది అటెండ్ అయ్యారు. పేపర్-2తో పోల్చుకుంటే పేపర్-1 ప్రశ్నపత్రం సులువుగా వచ్చిందని అభ్యర్థులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 20న కేంద్రం ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. సీటెట్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం రిలీజ్ చేసింది. https://ctet.nic.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని చెప్పింది. 29 లక్షల మంది అభ్యర్ధులు సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ – 1కు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ – 2కు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 రాసిన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. పేపర్ 2 రాసిన వారు 6 నుంచి 8 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. కాగా సీటెట్‌లో అర్హత సాధించిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వీలుంటుంది.